ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే : మంత్రి పొన్నం

ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే : మంత్రి పొన్నం
  • రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ముందు కూర్చుంటం: మంత్రి పొన్నం
  • రెండున్నరేండ్లలో ఒక్క రేషన్ కార్డు కోసం దరఖాస్తు రాలే 
  • ఇది మా ప్రజా పాలనకు నిదర్శనం
  • గాంధీ భవన్​లో జరిగిన మంత్రులతో ముఖాముఖి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎరువుల ఉత్పత్తి,  సరఫరా పూర్తి బాధ్యత కేంద్రానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సరిపోయేంత ఎరువులను సరఫరా చేయించే బాధ్యత కేంద్రానిదేనని, ఇప్పటికే సీఎం, మంత్రులం అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి కోరామని చెప్పారు.

రాష్ట్రానికి సరిపడా ఎరువులను సరఫరా చేయకపోతే కేంద్రంతో కొట్లాడ్తామని హెచ్చరించారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను పూర్తిగా రాష్ట్రం వినియోగించుకునేలా కేంద్రం చూడాలని కోరారు. హైదరాబాద్​లో కొత్తగా లక్ష ఇండ్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. చాలా మంది పేదలు ఇండ్ల​ కోసం దరఖాస్తులు ఇచ్చారన్నారు. పెన్షన్లపై కూడా చాలా వరకు దరఖాస్తులు వచ్చాయన్నారు.

2 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని, త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులిచ్చామని, అందుకే ఈ ముఖాముఖిలో రేషన్ కార్డు కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఇది తమ ప్రజా పాలన ప్రభుత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘రాష్ట్రంలో ఏ ప్రజావాణిలో గానీ, కలెక్టర్ల దగ్గర గానీ మీ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు గాంధీ భవన్‌కు రండి.. మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం’ అని మంత్రి పొన్నం ప్రజలకు సూచించారు.